- మరొకరికి తీవ్ర గాయాలు
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో వ్యవసాయ బావి తవ్వుతుండగా, మట్టి కూలి ఇద్దరు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన రేషవేణి రాజయ్య(55) పెద్దపల్లి పట్టణంలో ఉంటూ కొంత మంది కూలీలతో కలిసి వ్యవసాయ బావుల తవ్వకం, పూడికతీత పనులు చేస్తున్నాడు.
ఈక్రమంలో మంగళవారం జయ్యారం గ్రామ శివారులో మామిడాల రాజేశం పొలంలో బావి తవ్వుతూ, చుట్టూ సిమెంట్ కాంక్రీట్ వేస్తున్నారు. 10 మంది పని చేస్తుండగా, ఒక్కసారిగా మట్టి కూలడంతో పాటు బార్డర్ రింగులు వేయడానికి ఏర్పాటు చేసిన ఇనుప ప్లేట్లు బావిలోకి జారిపోయాయి. దీంతో మట్టిపై నిలుచున్న రాజయ్యతో పాటు జూలపల్లి మండలం వడుకాపూర్ గ్రామానికి భీమోజీ ఆంజనేయులు(45), సాగర్ల శ్రీనివాస్ బావిలో పడిపోయారు.
వారిపై మట్టి, ఇనుప ప్లేట్లు పడడంతో రాజయ్య, ఆంజనేయులు అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ జి.కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, బసంత్‌నగర్ ఎస్సై నూతి శ్రీధర్ ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు ప్రొక్లైన్ సాయంతో 10 అడుగుల మేర పడిపోయిన బురదమట్టిని తొలగించి రాజయ్య డెడ్‌బాడీని వెలికితీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాగర్ల శ్రీనివాస్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన శ్రీనివాస్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
